ఏనాటికీ ‘ఆమె’ ఆమేనా?
సింగి గొప్పా, నేల గొప్పా? అని ఆమె ఎప్పుడూప్రశ్నించి ఎరుగదు.
ఫెళ ఫెళ ఉరుములతో గర్జించి
అనంత జల రాశులు తనపై వర్షించినా...
నిదాఘ తాపంతో మల మల మాడ్చి
మండుటెండ తన దేహాన్ని బీటలు వార్చినా
తన మనుగడకు దోహదమయే రుతుచక్రంగా
వాటిని మార్చుకుని... ప్రాణులకు ఏడుగడగా మారి
అనేకానేక వృక్ష రాశుల్ని, పచ్చటి పొలాల్ని ప్రసవించింది!
అవును! ఆమె అవని!!
ఎన్ని తరాలు గడచినా పురుషుడితో సమానం
అవని ‘అవని’!
ఎన్ని తరాలు గడచినా
పురుషుడితో
సమానం
అవని ‘ఆమని’!
ఆమె త్రేతాయుగంతో అగ్ని పునీతైనా
నాటినుండీ ఈ నాటి వరకు తనకంటిన
అనుమానపు చెదలను వదిలించుకోలేని సీత!
అవసరమైన సమయంలో మానం కాపాడలేని,
కనీసం తన తనయుల ప్రాణం కాపాడలేని
‘మహా’ పురుషులకు...
వంతులు వేసుకున్న తనువునప్పచెప్పి...
మనసు దాచుకుని మండిపోతున్న యాజ్ఞసేని!!
రాజులిచ్చే ఆడు గుర్రాలు... ఏనుగులు... పల్లకులతో పాటు
తానూ వో దాన వస్తువైన నిస్సహాయ!
తరాలు గడుస్తూనే ఉన్నాయి!
వంటింటి గడప దాటి విదేశాల కేగినా...
విహాయసమేగినా...ఆంక్షల.. కాంక్షల.. ఆకాంక్షల
సర్ప బంధాలను ఛేదించుకోగల్గినా...
సర్వ సమర్ధురాలై ఇంటా బయటా చక్కబెట్టినా
ఇంకా వరకట్నపు వేధింపులు... అనుమానాల సాధింపులు!
అవమానాల బాధింపులు... అవహేళనల రుూసడింపులు!!
ఆ యుగానికి, ఈ యుగానికి ఒకటే తేడా!
బాధల గాథలో వైవిధ్యం... అనుమానపు చూపులో వైదగ్ధ్యం!
అంతే; అలా నిలబడి చూస్తుంటే... సుదూరాన
నింగీ నేలా కలిసినట్టే కనుపిస్తున్నాయి!
అచ్చం స్రీ పురుష సమానత్వం లాగా!
No comments:
Post a Comment